
AY సాక్ష్యం. శ్రీకాకుళం నగరంలోని పాత శ్రీకాకుళంలో కొలువై ఉన్న సకల సౌభాగ్య ప్రదాయిని, మహిమాన్వితమైన శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మరియు శుక్రవారం పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ పురాతన చారిత్రక పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోటి మహిమలు గల తల్లిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడే ఈ ఏకాదశి పర్వదినం రావడంతో, తెల్లవారుజాము నుండే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే అమ్మవారికి సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం జగన్మాతకు భక్తిశ్రద్ధలతో క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీ సూక్త విధానముతో షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు జరిగాయి. లోక కల్యాణార్థం అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, శ్రీ దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనంతో కుంకుమార్చనలు విశేషంగా సాగాయి. భక్తుల సమక్షంలో శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం మరియు శ్రీ లలితా సహస్రనామ పారాయణలు చేస్తూ విశేష అర్చనలు గావించారు. వేద పండితుల వేద పారాయణలు, మంత్రపుష్పము మరియు మహానివేదన అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి సతీమణి ప్రమీల గారు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి తనయుడు డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ గారు అమ్మవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు తెల్లవారుజాము నుండే కుంకుమ పూజలు, అర్చనలు మరియు ఉద్యాపనలు జరిపించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్య నిర్వహణాధి కారిణి మునగవలస సుకన్య గారు, ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ సిద్ధాంతి గారు మరియు దేవస్థాన సిబ్బంది పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

